Saturday, August 22, 2009

ఆశు నింద
ఓ కవిగారు, ఒక కన్నే వుండే ఓ రాజుగారి దర్శనానికి వెళ్ళారట.

ఆ రాజు దర్శనమివ్వడానికే చాలా రోజులు తిప్పలుపడాల్సి వచ్చిందట! (ఈ లోగా ఆయనకో ప్రియురాలు—అంటే ‘చిన్నిల్లు’ కూడా వుందని తెలిసిందట.)

కొన్నాళ్ళ తరవాత ఆఖరికెప్పుడో దర్శనం లభించిందట.

గుర్రుగా వున్న మనసుతో, నిండు సభలో నిలబడి, ఈ క్రింది పద్యం ఆశువుగా చదివాడట…..

“అన్నాతినిగూడ హరుడవు
అన్నాతినిగూడకున్న అసురుల గురుడౌ
అన్నాతిరుమలరాయా
కన్నొకటి కలదుగాని కౌరవపతివే!”

(అర్థం అయినవాళ్ళు చాటుగా నవ్వుకున్నారట, లేని వాళ్ళు ‘ఆహా! యెంతబాగా పొగిడాడు!’ అనుకున్నారట!)

దీని భావమేమి పాఠకేశా?

Friday, August 14, 2009

తెలుగు సాహిత్యం

పేటికాంతర శవము.
పెరమల రామచౌదరీగారిచే రచియించబడిన

అత్యద్భుతాపరాధ పరిశోధక నవల.
ప్రస్తుతము మన ఆంధ్ర వాఙ్మయమునందుగల అపరాధక నవలలోనెల్ల నియ్యదియే మిన్నయని చెప్పకతప్పదు. ఇందుగల ప్రతివిషయమును అత్యద్భుతాశ్చర్యజనకమై నీతిబోధాత్మకమై, విరాజిల్లుచుండును. ఆనంద విషాదముల కునికిపట్టగు నీనవల చదువ మొదలుపెట్టినచో ముందేమిజరుగునో యను తహతహ వొడముచుండును. వేరొకచో జదువరుల గుండెలవిచ్చన్నముగా నుండవేమో యనునంత భయము పుట్టజేయును. ఇంకొక్కచోట నాహా! ఎంతయాశ్చర్యమని నొచ్చుకొనకపోరు. ఎట్టియద్భుతములు—యెంతలేసి చమత్కారములు—ఇందు—సత్ప్రవర్తనుడగు రమేశదత్తుపైబడిన నేరము—ఆయనను అరెస్టు చేయుట, ఇందిరానరేంద్రుల స్నేహవాత్సల్యము—రమాసుందరి విజయుల బద్ధానురాగము—పాపము!—నీలకంఠుని ఘోరమరణము—దివాకరజీగారి యపరాధపరిశోధనానైపుణ్యము—నరేంద్రవిజయుల గూఢచర్యలు—దాదుచెందుపై ననుమానము—అపరాధపరిశోధనయందుగల రమాసుందరి బుధ్ధికుశలత—మలయాకరజీ గారి మాయానటన (రక్షకభటోద్యోగము) ఎత్తుపైఎత్తులు, వింతలు పై వింతలు—ఘోరహత్యలు—యుక్తిప్రదర్శనములు—శక్తిసామర్ధ్యములు—కపటానురాగములు మాయవేషములు మోసములు చదివితీరవలెనేగాని వ్రాయనలవికావు. ఇంతయేల ఇట్టినవల ఇదివరకు మీరు చదివి యుండరనియే చెప్పవచ్చును. ఛక్కని కాగితములపై డెమ్మీసైజున 250 పేజీలు గలిగియుండును. మృదుమధురములగు పదములతో తేలిక శైలిలో నతిచక్కగా వ్రాయబడినది. వెంటనే పుస్తకములకు వ్రాయుడు. ఆలస్యమైనచోనాశాభంగమే.
వెల రు. 1—0—0.
శ్రీ బాలకృష్ణా బుక్ డిపో., బుక్సెల్లర్సు, రాజమండ్రి.

(ఇది 1929 వ సంవత్సరం పి.వి.రామయ్య అండ్ బ్రదర్సు, శ్రీ బాలకృష్ణా బుక్ డిపో, రాజమండ్రి వారు ప్రచురించిన ఓ పుస్తకం మొదటి లోపలి అట్ట పై ప్రచురించిన వాణిజ్య ప్రకటన! మరి 1929 లోనే తెలుగులో (బెంగాలీ ప్రభావం తోనే కావచ్చు) అపరాధ పరిశోధక నవల వెలిసిందన్నమాట! కానీ 1940 ల్లో శ్రీ కొవ్వలి లక్ష్మీనరసిం హారావు గారు వ్రాసిన (పేరు గుర్తు లేదు) నవలనే తెలుగులో తొలి అపరాధ పరిశోధక నవలగా గుర్తించారు! బహుశా మిగిలినవి అలభ్యాలు కాబట్టి యేమో!)

యెవరైనా ఈవిషయం లో యేమైనా చెప్పగలరా?


Monday, August 3, 2009

కారడవి


వ. అది మఱియును మాతులుంగ లవంగ లుంగ చూతకేతకీ భల్లాత కామ్రాతక సరళ పనస బదరీ వకుళ వంజుళ వట కుటజ కుంద కురవక కురంటక కోవిదార ఖర్జూర నారికేళ సిందువార చందన పిచుమంద మందార జంబూ జంబీర మాధవీ మధూక తాలతక్కోల తమాల హింతాల రసాల సాల ప్రియాళు బిల్వామలక క్రముక కదంబ కరవీర కదళీ కపిత్థ కాంచన కందరాళ శిరీష శింశుపాశోక పలాశ నాగ పున్నాగ చంపక శతపత్ర మరువక మల్లికామతల్లికా ప్రముఖ నిరంతర వసంత సమయ సౌభాగ్య సంపదంకురిత పల్లవిత కుసుమిత ఫలిత లలితవటపవిటపి వీరున్నివహాలంకృతంబును, మణివాలు కానేక విమల పులినతరంగిణీసంగత విచిత్రవిద్రుమలతామహోద్యాన శుక పిక నికర నిశిత సమంచిత చంచూపుటనిర్దళిత శాఖిశాఖాంతర పరిపక్వ ఫలరంధ్ర ప్రవర్షిత రసప్రవాహ బహుళంబును, కమనీయ సలిలకాసార కాంచనకుముదకల్ హార కమల పరిమళ మిళిత కబళాహార సంతతాంగీకార భారపరిశ్రాంత కాంతా సమాలింగితకుమార మత్తమధుకర విట సముదయ సమీప సంచారసముదంచిత శకుంత కలహంస కారండవ జలకుక్కుట చక్రవాక బక బలాక కోయాష్టికముఖర జలవిహంగవినర వివిధకోలాహల బధిరీభూత భూనభోంతరాళంబును, దుహినకరకాంత మరకత కమలరాగ వజ్ర వైడూర్య నీల గోమేధిక పుష్యరాగ మనోహర కనక కలధౌత మణిమయానేక శిఖరతటదరీ విహరమాణ విద్యాధర విబుధ సిద్ధ చారణ గరుడ గంధర్వ కిన్నర కింపురుష మిథున సంతత సరస సల్లాపసంగీత ప్రసంగమంగళాయతనంబును, గంధగజ గవయ గండభేరుండ ఖడ్గకంఠీరవ శరభ శార్దూల చమర శల్యభల్ల సారంగ సాలావృక వరాహ మహిష మర్కట మహోరగ మార్జాలాది నిఖిల మృగనాధ సమూహ సమరసన్నాహసం రంభ సంచకిత శరణాగతశమనకింకరంబునునై యొప్పునప్పర్వత సమీపంబునందు.

క. భిల్లీ భిల్ల లులాయక
భల్లుక ఫణి ఖడ్గ గవయ * బలిముఖ చమరీ
ఝిల్లీ హరి శరభక
మల్లాద్భూత కాక ఘూక * మయ మగునడవిన్.

శా. అన్యాలోకన భీకరంబులు జితా * శానేక పానీకముల్
వన్యేభంబులు గొన్ని మత్తతనులై * వ్రజ్యావిహారాగతో
దన్యత్వంబున భూరిభూధరదరీ * ద్వారంబులందుండి సౌ
జన్య క్రీడల నీరుగాలిపడి కా * సారావగాహర్థమై

ఇదేమిటి? తెలుగంటారా?

అవును--ఇదే తెలుగు మరి!

వారం అవుతోంది, వ్యాఖ్యలేమీ రాలేదేమిటబ్బా!

యేమిటి.....కొరుకుడుపడడం లేదా? హా! తెలుగుతల్లీ!